ఏ జన్మ ఋణమో

Sai
4 min readDec 27, 2022

సీతాపురంలోని రామాలయం వీధిలో రామలక్ష్మమ్మగారు అనే ఆవిడ తన ఒక్కగానొక్క కొడుకూ ఉంటుండేవారు. రామలక్ష్మమ్మగారి భర్త కొన్నాళ్ల క్రితమే కాలం చేశారు. కట్నంగా ఆవిడ తెచ్చిన పొలం కౌలుకిచ్చి, పాలు, పెరుగు అమ్ముకుంటూ బ్రతుకు బండి లాక్కొచ్చేవారు. భర్త పోయినప్పటి నుంచి రామలక్ష్మమ్మగారు రాముని సేవలో కాలం గడిపేవారు. గుడి, పాడి తప్ప వేరే లోకం ఎరుగదు. గుడి నుంచి వస్తూ వస్తూ ప్రసాదంగా ఇచ్చిన అరటి పళ్ళు, కొబ్బరి ముక్కలు అక్కడున్న ఒక కోతికి పెట్టేది. ఆ కోతిని ముద్దుగా మారుతి అని పిలిచుకునేది.

మారుతి కూడా రామలక్ష్మమ్మగారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ప్రసాదం పెడతారా అని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా రామలక్ష్మమ్మ గారికి సుస్తీ జేసి గుడికి వెళ్లకపోతే మారుతి, రామలక్షమ్మగారి ఇంటి గుమ్మం దగ్గర దిగాలుగా కూర్చునే వాడు.రామలక్షమ్మ గారు ఓపిక చేసుకుని ఏమన్నాపెడితే తిని కాసేపు అక్కడే కూర్చుని వెళ్లిపోయేవాడు.

రామలక్షమ్మగారబ్బాయి సత్యం ఆ కోతిని ఎక్కువ చేరదీయవద్దని విసుక్కుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా అలా గుమ్మం దగ్గర కూర్చుని ఉంటే గదిమి తరిమేసేవాడు. ఆ నోరులేని జీవం నిన్నేమి చేసిందని సత్యానికి నచ్చజెప్ప జూసేది రామలక్ష్మమ్మ. మారుతి ఏనాడు ఇంట్లోకి అడుగుపెట్టేవాడు కాదు. గుమ్మం దగ్గర, గుడి మెట్ల దగ్గరే తన పడిగాపులు. వాళ్ళ స్నేహం ఊళ్ళో వాళ్ళందరికీ చూడటానికి బహు ముచ్చటగా ఉండేది. ఎప్పుడైనా రామలక్ష్మమ్మ గుళ్ళోకి కొబ్బరికాయ తీసుకువెళ్లడం మర్చిపోతే మారుతి పరుగు పరుగున పోయి, పూలకొట్లో చెంగున కొబ్బరికాయ పట్టుకొచ్చేవాడు.

కొన్నాళ్ళకి రామలక్ష్మమ్మగారికి బాగా జబ్బు చేసి మంచం పట్టింది. ఎన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. రామలక్ష్మమ్మగారి ఆఖరి ఘడియలనీ, చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టమన్నారు ధన్వంతరిగారు. కొడుక్కి మంచి మాటలు చెప్పింది రామలక్ష్మమ్మ. చుట్టాలు చుట్టూజేరారు. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి ఆవిడ కళ్ళు. గుడి నుంచి తీర్ధంలో వేసిన తులసాకులు పట్టుకొచ్చాడు మారుతి. చెమ్మగిల్లిన కళ్ళతో సత్యానికి తులసాకులు అందించాడు మారుతి. నారాయణ మంత్రం చదువుతూ తీర్ధం రామలక్ష్మమ్మ అంగిట్లో పోసాడు సత్యం. ఒకసారి మారుతికేసి, చివరిసారిగా సత్యానికేసి చూసి కన్నుమూసింది.

మారుతి రోజూ దిగాలుగా రామలక్ష్మమ్మ గారి ఇంటి ముందు కూర్చునేవాడు. సత్యానికి జాలేసి రోజూ ఏదో ఒకటి పెడుతుండేవాడు. కొన్నాళ్ళకి సత్యం మారుతిని పట్టించుకోవడం మానేసాడు. మారుతి మాత్రం ఇంట్లో ఉన్న రామలక్ష్మమ్మ గారి పటంకేసి చూస్తూ గుమ్మం దగ్గరే పడిగాపులు కాసేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో సత్యం బాగా చికాకుగా ఉండేవాడు. దారికడ్డంగా ఉన్న మారుతిని కసురుకుని, కోపంగా కర్ర విసిరాడు. మారుతికుంటుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ ఇంటి ముందు ఎప్పుడూ కనిపించలేదు.

కొన్నాళ్ళకి సత్యానికి కూతురు పుట్టింది. తన తల్లే తిరిగి తన కడుపున పుట్టిందని రామలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. రాముడు అని ప్రేమగా పిలుచుకునేవాడు. అల్లారు ముద్దుగా పెంచుకునేవాడు. రాముడు ఆడింది ఆట పాడింది పాట. వీధిలో పిల్లలందరితో కలిసి రాముడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తన ముద్దు మాటలతో, చిలిపి చేష్టలతో సత్యానికి సమయం తెలిసేది కాదు. తన అల్లరి పడలేక అమ్మ కేకలేస్తే ఊరుకునే వాడు కాదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే “పసి పిల్ల కదండీ” అని నవ్వుతూ దాట వేసేవాడు.

ఒక రోజు సత్యం రాముడిని రామాలయానికి తీసుకు వెళ్ళాడు. పూజారి గారు శఠారి పెట్టి ఇద్దరినీ ఆశీర్వదించారు. సత్యం జేబులోంచి నోట్లు తీసి లెక్కపెడుతన్నాడు. రాముడు పుసుక్కున చేతిలో ఉన్నదంతా లాక్కుని పూజారి గారి పళ్లెంలో వేసేసింది.

“ప్రేమ, దక్షిణ రెంటికీ కొలతలుండకూడదు నాన్నా” అని కిలకిలా నవ్వింది.

“అమ్మాయిదంతా అమ్మగారి పోలికే సత్యం. ఆవిడలాగే పెద్ద చెయ్యి”. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు పూజారిగారు. మురిసిపోతూ మెట్లు దిగాడు సత్యం.

“ఆ సత్యం.. అమ్మాయికి ఆయుష్ హోమం సంగతి” అని గుర్తు చేశారు పూజారిగారు.

“గుర్తుంది పూజారి గారు” అని ఇంటికి బయలుదేరాడు సత్యం.

ఒక రోజు రాముడిని బళ్ళో దింపి వ్యాపార నిమిత్తమై పొరుగూరు ప్రయాణమయ్యాడు సత్యం. “రాముడూ నీ స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చేస్తావుగా ? నువ్వు ఆలస్యంగా ఇల్లు జేరితే అమ్మ ఖంగారు పడుతుంది” అని కూతురికి హిత బోధ చేసాడు సత్యం. సరే అన్నట్టు తలూపింది రాముడు.

సత్యం ఊరు దాటగానే కుంభవృష్టి మొదలయ్యింది. ఎడతెరపి లేకుండా ఆ రోజు సాయంకాలం దాకా కురుస్తూనే ఉంది వర్షం. చాలా వరకు దారులన్నీ వాన నీటితో నిండి పోయాయ్. చెట్లు విరిగిపడ్డాయ్. కరెంటు తీగలు తెగి పడ్డాయ్. ముసలి వాళ్లంతా అలో లక్ష్మణ అని చలికి చివురుటాకుల్లా వణికిపోతుంటే, నడివయస్కులంతా ఎడతెరపిలేని వాన మీద చికాకు పడుతున్నారు, పసివాళ్ళకి మాత్రం ఆ పొంగిపొర్లుతున్న నీళ్లలో దూకడం, కాగితం పడవలు వేయడం మహా సరదాగా ఉంది. కనిపించిన ప్రతి నీటి గుంటలో చిందులేస్తూ అల్లరి చేస్తూ తడుస్తూ తుళ్ళుతూ ఇంటి బాట పట్టారు రాముడు, రాముడి మిత్రబృందం.

రామాలయం వీధి చివర తిరగ్గానే ఒక ముసలాయన రాముడి మిత్రబృందంకేసి చూస్తూ మేడ మీద నుంచుని పెద్ద పెద్దగా అరుస్తూ చేతులు ఊపుతున్నాడు. రాముడు వాళ్ళకి అతను ఏం చెప్తున్నాడో వినపడటం లేదు. ఆ ముసలాయన అరిచే అరుపులు స్పష్టంగా వినపడటం లేదు. వాళ్ళు ఆయన్ను పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఆ ముసలాయన ఇంకా బిగ్గరగా అరుస్తూ వాళ్ళకేసి రాళ్లు రువ్వసాగాడు. పిల్లలు భయపడి దారికి ఆ మూలన చేరి బిక్కు బిక్కుమంటూ ముందుకు నడవసాగారు. ముసలాయన పెద్దగా ఏడుస్తూ తలబాదుకుంటున్నాడు. అతనికి పిచ్చేమో అనుకుంది రాముడు. వడి వడిగా ముందుకు సాగింది. ఇంతలో పిడుగుపాటు లాంటి పెద్ద శబ్దమయ్యింది. అందరూ ఉలిక్కిపడి ఉన్న చోటనే పిడచకట్టుకుపోయారు. ఆ శబ్దానికి చుట్టూ పక్కన వాళ్ళు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ముసలాయన మెల్లగా మేడ దిగి కిందకి వచ్చాడు. ఇరుగు పొరుగు చుట్టూ చేరారు. పిల్లలు ముసలాయన్ను చూసి భయపడిపోతున్నారు.

‘భయపడకండమ్మా, భయపడకండి’. ఆ నీళ్లలో కరెంటు తీగ తెగి పడిందమ్మా. నేను మేడ ఎక్కి చూడగానే మా కోడి ఆ నీళ్లలో చచ్చిపడి ఉంది. మీరు ఆ నీళ్లకేసి వెళుతున్నారన్న ఖంగారులో కేకలేసి రాళ్లురువ్వాను ఏమి అనుకోకండి అని చెప్పాడు. ఇంక మీకు ప్రమాదం లేదు. అక్కడ ట్రాన్స్ఫారమ్ పేలినట్టుంది. ఇప్పుడిప్పుడే కరెంటు రాదు మీరు ఇంటికి వెళ్ళండి అని సాగనంపాడు.

ఆ రాత్రంతా కరెంటు లేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి జేరి కూతురికి తప్పిన ప్రమాదం గురించి తెలుసుకుని తనని గట్టిగా కావలించుకున్నాడు సత్యం. ఇంటి ముందర కోలాహలం గమనించి బయటకు వచ్చి చూసాడు. జనం ట్రాన్స్ఫార్మర్ కేసి పరుగిడుతున్నారు. సత్యం, సత్యం భార్య, రాముడు కూడా జనం వెంటనడిచారు.

ఆమ్మో… ఎంత పెద్ద ప్రమాదం తప్పింది ఆ దేవుడే కాపాడాడు అనుకుంటున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని పక్కకి తోస్తూ ముందు వరసకు చేరారు. విద్యుత్శాఖా ఉద్యోగులు ట్రాన్స్ఫార్మర్ కి చిక్కుకున్న ఒక కోతిని తీసి కింద పడేసారు.

ఆ కోతే లేకపోతే మన పిల్లలు మనకి దక్కేవాళ్ళు కాదు, దానికి ఏ జన్మలో ఋణమో ఈ పిల్లలని కాపాడి అది కాస్తా తీర్చేసుకుంది ! అన్నాడు ముసలాయన.

విగతజీవిగా పడి ఉన్న మారుతిని చూసి సత్యం కళ్ళు చెమర్చాయి. అక్కడే దూరంగా కూర్చుని ఏడుస్తున్న కోతి పిల్లని చేరదీసింది రాముడు. మీ నాన్న చనిపోయాడా ? ఏడవకు నీకు నేనున్నాను అంజి అని గట్టిగా తన గుండెలకు హత్తుకుంది.

--

--